సర్కారు బడి ముందు ఆ బోర్డు..!

SMTV Desk 2018-06-16 17:49:06  jannaram schools, manchiriala school, jannaram scholl, government school,

మంచిర్యాల, జూన్ 16 : సాధారణంగా సర్కారీ బడుల్లో పిల్లలు లేక ఇబ్బందులు పడ్డ రోజులు చూశాము. ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్స్ హవా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ఫలితం కనిపించడం లేదు. కార్పొరేట్‌ పాఠశాలల వద్ద ‘అడ్మిషన్స్‌ క్లోజ్డ్‌’ (ప్రవేశాలన్నీ అయిపోయాయి) అనే బోర్డు వేలాడుతూ ఉండటం పరిపాటే. కానీ, సర్కారుబడి వద్ద ఇలాంటి బోర్డు కనిపించడం అరుదే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించడానికి వారి తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. ఇక్కడ 80 మంది విద్యార్థులు మాత్రమే చదువుకోవడానికి సౌకర్యం ఉండగా ఇప్పటికే 120 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో చేసేది లేక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్‌ ‘అడ్మిషన్స్‌ క్లోజ్డ్‌’ అనే బోర్డు పెట్టించారు. దాంతో సర్కారు బడులన్నిటికీ ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితే వస్తే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల పిల్లలతో కళకళలాడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.