చైతన్యపురిలో దారుణం..

SMTV Desk 2018-06-16 11:23:31  chaitnyapuru twins murder, twins murder in hyderabad, srujana, hyderabad

చైతన్యపురి, జూన్ 16 : హైదరాబాద్‌లోని చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరి మానసిక వికాలాంగులను మేన మామే హత్యచేశాడు. ఈ ఘటన చైతన్యపురి పోలీసు పరిధిలోని సత్యనారాయణపురంలో జరిగింది. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సృజన(12), విష్ణువర్దన్‌ రెడ్డి(12)లుగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాసరెడ్డి, లక్ష్మి దంపతులకు 12 ఏళ్ల క్రితం మానసిక వికలాంగులైన మగ, ఆడ బిడ్డలు జన్మించారు. వారి పేర్లు సృజనరెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి. పుట్టినప్పటి నుంచి వారిద్దరూ మాట్లాడలేరు. అయితే పిల్లలిద్దరిని మేనమామ మల్లికార్జున్‌రెడ్డి శుక్రవారం చైతన్యపురిలోని తను అద్దెకుంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి తన రూమ్‌మేట్‌ వెంకట్రామిరెడ్డి సాయంతో వారిద్దరినీ హత్య చేశాడు. అర్థరాత్రి వేళ వారి మృతదేహాలను కారులో ఎక్కిస్తుండగా ఇంటి యజమాని మహేశ్‌రెడ్డి ఏమైందని ప్రశ్నించాడు. పిల్లలకు ఆరోగ్యం బాగోలేనందు వల్ల ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. అయితే వారి తీరుపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మల్లికార్జన్‌రెడ్డి, అతడి రూమ్‌మేట్‌ వెంకట్రామిరెడ్డి, కారు డ్రైవర్‌ వివేక్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులను చైతన్యపురి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా పిల్లల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మానసికంగా ఎదగలేదనే కారణంతోనే చంపేశారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.