రసకందాయంలో తమిళ రాజకీయం..

SMTV Desk 2018-06-14 17:30:14  aiadmk court case, tamilanadu mla, aiadmk 18 mlas, tamilanadu

చెన్నై, జూన్ 14 : తమిళనాడులో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో షాకింగ్ ట్విస్టు చోటు చేసుకుంది. దీంతో తమిళనాడు రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. దినకనర్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులు చెప్పారు. దీంతో తుది తీర్పు నిమిత్తం ఈ విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేసింది హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్‌ న్యాయమూర్తి దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. జస్టిస్‌ సెల్వం దీనికి పూర్తి విరుద్ధంగా తీర్పునిచ్చారు. స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయంలో అనేక కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. సీఎం పదవి నుంచి పన్నీర్‌ సెల్వంను తప్పించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని జయలలిత నెచ్చెలి శశికళ అనుకున్నారు. దీన్ని పన్నీర్‌సెల్వం వ్యతిరేకించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు అనూహ్యంగా శశికళ జైలుకెళ్లడంతో సీఎం పగ్గాలను పళనిస్వామికి అప్పగించారు. శశికళ మేనల్లుడు దినకరన్‌ కూడా పళనిస్వామికి మద్దతిచ్చారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు పళని, పన్నీర్‌ వర్గాలు కలిసిపోయి శశికళ, దినకరన్‌లను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. పళని సీఎంగా, పన్నీర్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పన్నీర్‌ సెల్వంతో చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన దినకరన్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పళనిస్వామికి ఎదురుతిరిగారు. ఈ నేపథ్యంలో సీఎం పళనిస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. 2017 ఫిబ్రవరిలో బలపరీక్ష జరగగా.. దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే పార్టీ విప్‌ జారీ చేసింది. అయితే ఈ విప్‌ను ధిక్కరిస్తూ 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతిచ్చారు. దీంతో వారిపై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ 18 మంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఏడాది జనవరిలో తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.మూడో న్యాయమూర్తి అనర్హత వేటును సమర్థిస్తే ఆ 18 ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా తమిళనాడు రాజకీయం మరో సారి రసవత్తరంగా మారింది.