నరకం చూపించిన తల్లిదండ్రులు

SMTV Desk 2017-07-12 17:56:07  WOMEN, HUSBEND, PARENTS, POLICE, DARK ROOM, GOA,

పనాజీ, జూలై 12 : ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుని తన భర్తతో నిండు నూరేళ్ళు గడపాలనుకుంది ఆ యువతి. కాని ఆమె ఆశలన్నీ ఆవీరయ్యాయి. తన భర్తకు ఇంతకుముందే పెళ్లైందని తెలుసుకున్న ఆమె తీవ్ర మనో వేదనకు గురై, తిరిగి పుట్టింటికి వచ్చేసింది. కాని ఆదరించాల్సిన తల్లిదండ్రులు కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సంవత్సరాలు ఆమెను చీకటి గదికే పరిమితం చేశారు. వివరాలలోకి వెళితే.. గోవాలోని కాండోలిమ్‌ గ్రామానికి చెందిన మహిళకు 20ఏళ్ల కిందట ముంబాయికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కాని అత్తారింటికి వెళ్లిన కొద్ది రోజులకే తన భర్తకు ఇదివరకే పెళ్లయిందని తెలుసుకున్న మహిళ, తీవ్ర మనస్తాపానికి గురై ఇక ఆ బంధం వద్దనుకొని తిరిగి పుట్టింటికి వచ్చేసింది. దీంతో అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలాంటి పరిస్థితిలో ఆమెకు అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే ఆమెను ఒక చీకటి గదిలో బంధించారు. కిటికీలోంచి ఆహారం, నీరు అందిస్తూ దాదాపు 20 ఏళ్ళ పాటు అలాగే ఉంచారు. ఇటీవల ఆమెను చూసిన ఓ వ్యక్తి.. మహిళల హక్కులను కాపాడే ‘బైలాంచావో సాద్‌’ అనే ఎన్జీవోకు ఈ-మెయిల్‌ చేశాడు. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. ఇంటి వెనకాల ఓ చీకటి గదిలో ఉన్న మహిళను గమనించి, గది తలుపులు తెరిచేసరికి ఆ మహిళా వివస్త్రగా, భయపడుతూ కనిపించింది. ఆ మహిళ వయస్సు 50 ఏళ్ళ పైనే ఉంటుంది. గది బయటకు రావడానికి అస్సలు ఇష్టపడలేదని ఎంతో నచ్చజెప్పి తీసుకోచ్చామని మహిళా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, కాని ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.