విపక్షాలకు ధీటుగా.. టీడీపీ వ్యూహాలు..

SMTV Desk 2018-06-14 12:24:55  tdp, ap politics, tdp vs ysrcp, amaravathi

అమరావతి, జూన్ 14 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ అప్పుడే మొదలైనట్టు ఉంది. ప్రజా యాత్రల పేరుతో ముఖ్య పార్టీలు ప్రజలను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఓ వైపు విపక్షాలు పాదయాత్రలు, బస్సు యాత్రల పేరిట ప్రచారం మొదలుపెట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీ సైతం అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతోంది. నాలుగేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరోసారి అధికార పీఠం కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. నాలుగేళ్లలో 110కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అధికార పార్టీ లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఎన్నికల హామీల్లో లేనివి సైతం టీడీపీ ఆచరణలో పెట్టింది. పట్టిసీమ నిర్మాణంతో డెల్టాలో కష్టాలు తీర్చడంతో పాటు రాయలసీమకు సైతం నీరు తరలించారు. ఎన్నడూ లేని విధంగా జూన్‌ నెలలోనే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి సైతం గండికోట జలాశయం ద్వారా నీటిని అందించారు. దీన్ని రాజకీయ అనుకూలంగా మలచుకోవాలని అధికార పార్టీ యోచిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది. చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ కేంద్రంగా ఎన్నో కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. తిరుపతి పరిసర ప్రాంతాలకు సైతం ఐటీ, ఎలక్ర్టానిక్స్‌, మొబైల్‌ తయారీ పరిశ్రమలు తరలివచ్చాయి. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.