జీవా నన్ను మార్చేసింది : మిస్టర్ కూల్

SMTV Desk 2018-06-13 11:13:45  dhoni-jiva, dhoni jiva photos, ipl csk, csk captain dhoni

ముంబై, జూన్ 13 : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన కూతురు, గారాల పట్టీ జీవా వలన వ్యక్తిగా మాత్రం ఎంతో మారానని అన్నాడు. తండ్రి అయినప్పటి నుంచి క్రికెటర్‌గా తనలో మార్పు వచ్చిందో.. లేదో కానీ.. వ్యక్తిగా మాత్రం ఎంతో మార్పు చెందానని ధోని తెలిపాడు. వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ నోరు విప్పని ధోని.. స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన ఓ షోలో తన కూతురితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు. "కూతుర్లందరూ వారి తండ్రులను ఇష్టపడుతారు.. కానీ నా విషయంలో అలా జరగలేదు. జీవా పుట్టినప్పుడు నేను అక్కడలేను. ఎక్కువ సమయం క్రికెట్‌లోనే గడచిపోయేది. ఈ మధ్యలో నా పేరు చెప్పి ఇంట్లోవాళ్లు తనకు భయం చెప్పేవారు. జీవా అన్నం తినకపోతే నాన్న వస్తున్నాడు అని చెప్పి బెదిరించే వారు. ఏదైనా అల్లరి పనులు చేస్తున్నా ఇలాగే చేసేవారు. దీంతో నాన్న అనగానే ఏదో తెలియని భయాన్ని ఆమెలో కల్పించారు. నేను దగ్గరకు తీసుకోవాలని చూస్తే భయపడుతూ దూరంగా ఉండేదని" ధోని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సీజన్‌ ఐపీఎల్‌తో జీవాతో ఆ దూరం తగ్గిందని ధోని ఆనందం వ్యక్తం చేశాడు. "ఈ సీజన్‌లో నా కూతురితో గడిపే సమయం ఎక్కువగా దొరికింది. నా వెంట ఉన్నప్పుడు ఎప్పుడూ స్టేడియంకు వెళ్లాలని మాత్రమే అడిగేది. అక్కడ జట్టు సహచరుల పిల్లలతో ఎంతో సరదాగా ఆడుకునేది. నేను 1.30, 2.30, 3 గంటలకు లేచేవాడిని. జీవా మాత్రం 9 గంటల్లోపే లేచి బ్రేక్‌ఫాస్ట్‌ చేసుకుని, పిల్లలతో ఆడుకునేది. అది చూసినప్పుడు నాకు ఎంతో ఉల్లాసంగా ఉండేది" అని ధోని వ్యాఖ్యానించాడు.