నీరవ్ మోదీ ఎక్కడున్నాడో తెలియదు: సీబీఐ

SMTV Desk 2018-06-11 18:31:37  nirav modi, pnb scam nirav modi, london nirav modi, cbi

ఢిల్లీ, జూన్ 11 : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును నిలువునా ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సీబీఐ స్పందించింది. నీరవ్‌ ఎక్కడున్నారన్న దానిపై ఎలాంటి ధ్రువీకరణ లేదని సీబీఐ అధికారులు స్పష్టంచేశారు. అతడు ఎక్కడున్నాడో తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని సీబీఐ ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇండియాలో రెండో అతిపెద్ద బ్యాంక్‌ అయిన పీఎన్‌బీలో నీరవ్‌ మోదీ, అతడి మామ మెహుల్‌ చోక్సీలు కలిసి రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మోసం బయటపడక ముందే విదేశాలకు పారిపోయిన నీరవ్‌.. లండన్‌లో ఉంటూ అక్కడ పొలిటికల్‌ ప్రాసిక్యూషన్‌ పేరుతో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఈ రోజు వార్తలు వెలువడ్డాయి. బ్యాంకులను వేల కోట్లకు మోసగించి ఇలా బ్రిటన్‌ పారిపోయిన వ్యక్తుల్లో నీరవ్‌ రెండోవాడు. ఇప్పటికే విజయ్‌ మాల్యా లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నీరవ్‌ కంపెనీ ఒక స్టోర్‌ను కలిగిఉన్న లండన్‌లోనే నీరవ్‌ మకాం వేశారని రాజకీయ ఆశ్రయం పొందేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు చెబుతున్నారని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. భారత్‌తో తమ సంబంధాలను ఈ తరహా సున్నితమైన కేసులు కొంత అలజడి రేపుతాయని, ఏమైనా ఇరు దేశాలు న్యాయప్రక్రియకు అనుగుణంగా వీటిని ఎదుర్కొంటాయని, అయితే ఈ క్రమంలో తాము మానవ హక్కుల పరిరక్షణ చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని బ్రిటన్‌ విదేశాంగ శాఖ కార్యాలయ అధికారి తెలిపినట్టు ఈ కథనం వెల్లడించింది.