వ్యాఖ్యాతగా వార్నర్..

SMTV Desk 2018-06-10 18:07:33  david warner commentate , david warner, ball tampering, capetown, steve smith

సిడ్నీ, జూన్ 10 : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న వార్నర్ వ్యాఖ్యాతగా అలరించనున్నాడు. ఈ నెలలో ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్‌, ఒక టీ20 మ్యాచ్‌ నిమిత్తం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ దూరమైన వార్నర్‌ తొలిసారిగా ఈ సిరీస్‌కు కామెంటేటర్‌ పనిచేయనున్నాడు. దీనిలో భాగంగా ఛానెల్‌-9కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 16న జరగనున్న రెండో వన్డేకు వార్నర్‌ వ్యాఖ్యాత బృందంతో వచ్చి చేరనున్నాడు. ఈ సిరీస్ తర్వాత స్మిత్‌తో కలిసి కెనడాలో ప్రారంభం కానున్న గ్లోబల్ టీ20 టోర్నీలో ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ కూడా ఆడనున్నాడు. జూన్ 28 నుంచి జూలై 15 తేదీల మధ్య ఈ టోర్నీ జరగనుంది. మార్చి నెలలో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్‌ ఓపెనర్‌ బెన్‌క్రాఫ్ట్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. దీనితో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు కూడా సంబంధం ఉందని తేలడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా స్మిత్‌, వార్నర్‌పై ఏడాది, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలపాటు నిషేధం వేసింది.