ప్రభుత్వరంగ బ్యాంకులు.. నష్టాల బాటలు..

SMTV Desk 2018-06-10 16:14:45  psu banks loss, public sector banks, pnb scam, indian bank

ఢిల్లీ, జూన్ 10 : ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ అతలాకుతలమవుతుంది. పెరిగిపోతున్న అప్పుల భారంతో పాటు డిపాజిట్లు లేక బ్యాంకులకు నగదు కొరత వేధిస్తుంది. కుంభకోణాలు, మొండి బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెను భారంగా మారాయి. వీటి కారణంగా ఆయా బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర నష్టం.. అక్షరాలా రూ.87,357కోట్లు. బ్యాంకుల త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఈ విషయం రుజువైంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 19 బ్యాంకులు నష్టాలను నమోదుచేశాయి. ఈ నష్టం విలువ రూ. 87,357కోట్లు. కేవలం ఇండియన్‌ బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ మాత్రమే లాభాలను గడించాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్‌ బ్యాంక్‌ రూ. 1,258.99కోట్ల లాభాన్ని నమోదుచేయగా.. విజయ బ్యాంక్‌ లాభం రూ. 727.02కోట్లుగా ఉంది. ఇక నష్టాలు చవిచూసిన బ్యాంకుల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తొలి స్థానంలో ఉంది. ఈ ఏడాది పీఎన్‌బీలో జరిగిన భారీ కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ నిందితుడిగా ఉన్న ఈ స్కాం విలువ రూ. 14వేల కోట్లకు పైనే. కుంభకోణం నేపథ్యంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ రూ. 12,282.82కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది.