మూడో విడతకు శ్రీకారం చుట్టనున్న సీఎం

SMTV Desk 2017-07-12 13:32:09  karimnagar, harithaharam, Third installment,40 lakh plant etelarajandra, government

హైదరాబాద్, జూలై 12 : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టిన హరితహారం మూడో విడత ప్రారంభానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా హరితహారం మూడో విడుతగా సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం కరీంనగర్ లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని కరీంనగర్ అలంకరణలతో ముస్తాబైంది. మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియం, కలెక్టరేట్, ఎల్ఎండీ రిజర్వాయర్ సమీపంలో మొక్కలు నాటే ప్రాంతాలను పరిశీలించి, ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్ళను కార్పెట్ గ్రాస్ తో అలంకరించారు. సీఎం మొక్కను నాటే బతుకమ్మకుంట సమీపంలో డ్యాం కట్టకు తెలంగాణ హరితహారం అనే అక్షరాలను మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అక్కడ మహోగని అనే ఔషద మొక్కను నాటుతారు. అనంతరం అంబేడ్కర్ స్టేడియానికి చేరుకొని అక్కడ మొక్కలను పంపీణీ చేసి, బహిరంగసభ లో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో మూడో విడత హరితహారాన్ని ఓ పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు హరితహారం నర్సరీ డైరెక్టరీ రూపుదిద్దుకుంది. శుక్రవారం నాటికి అన్ని ప్రాంతాల్లో పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు, వార్డుల నుంచి జిల్లాల వరకు గ్రీన్ బ్రిగేడ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. హరిత తెలంగాణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీని విద్యాశాఖకు ప్రత్యేకంగా గ్రీన్ డేగా నిర్ణయించారు. హరితహారానికి సేవలనందించే వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేక అవార్డులు, రివార్డులు ఇవ్వనున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రూ.15 కోట్ల మేరకు నగదు రూపంలో రివార్డులను ఇవ్వనున్నారు.