తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ ప్రారంభించిన కేటీఆర్‌..

SMTV Desk 2018-06-09 17:32:51   Telangana Diagnostics, diagnostic centre - Telangana Diagnostics, ktr, ts health minister lakshma reddy

హైదరాబాద్‌, జూన్ 9 : సామాన్యులకు, పేదలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా వ్యాధి నిర్దారణ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించాలని భావించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ సెంట్రల్‌ హబ్‌ ప్రారంభమైంది. నారాయణగూడ ఐపీఎం క్యాంపస్‌లో హబ్‌ను మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ హబ్‌లో ఉచితంగా 53 రకాల వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 106 కేంద్రాల నుంచి సెంట్రల్‌ హబ్‌కు నమూనాలు రానున్నాయి. సెంట్రల్‌ హబ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వైద్య పరీక్షల కోసం కేటీఆర్‌ రక్త నమూనా ఇచ్చారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 40 ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పేద వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి పదివేల మందికి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేసామని మంత్రి వెల్లడించారు. అందులో భాగంగా నగరంలో 17 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంట్రల్‌ హబ్‌ పేదప్రజలకు ఓ వరం అని కేటీఆర్‌ తెలిపారు.