కర్ణాటకలో పూర్తయిన పదవుల పంపకం..!

SMTV Desk 2018-06-09 16:56:08  Karnataka Portfolios Out, Chief Minister HD Kumaraswamy , congress- jds, karnataka

బెంగళూరు, జూన్ 9 : కర్ణాటక కాబినెట్ లో పదవుల కేటాయింపు దాదాపు పూర్తి కావచ్చిదని సమాచారం. రాష్ట్ర సీఎంగా జేడీఎస్‌ నేత కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు అయినప్పటికీ పూర్తి స్థాయి ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ ఏర్పడలేదు. సంకీర్ణ ప్రభుత్వం కావడంతో కాంగ్రెస్‌ అభిప్రాయానికి అనుగుణంగానే మంత్రిత్వ శాఖల పంపకం జరగాలని నిర్ణయించిన జేడీఎస్‌.. అందుకు అనుగుణంగా ఇన్ని రోజులు ఎదురుచూసింది. తొలుత రెండు పార్టీల్లోనూ పదవుల పంపకంలో స్వల్ప విభేదాలు తలెత్తాయన్న వార్తలొచ్చినప్పటికీ ఇవి కేవలం వదంతులు మాత్రమేనని ఇరు పార్టీలు ఖండిస్తూ వచ్చాయి. ఇప్పుడీ వార్తలన్నింటికీ సమాధానం చెబుతూ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలు, అవి ఎవరెవరికి దక్కాయనే దానిపై స్పష్టత వచ్చేసింది. ఎవర్నీ నొప్పించకుండా ఇరుపార్టీలకు సమన్యాయం జరిగిందని ఇరు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒప్పందంలో భాగానే జేడీఎస్‌కు 11మంత్రిత్వశాఖలు దక్కాయి. కాంగ్రెస్‌లో కొందరు నేతలకు కేటాయించగా, ఇంకా ఆరు మంత్రిత్వశాఖలు ఖాళీగా ఉన్నాయి. >> కుమార స్వామికి ముఖ్యమంత్రి పదవితోపాటు ఆర్థిక శాఖ, విద్యుత్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమాచారం, పబ్లిక్‌ రిలేషన్స్‌, ఇంటెలిజెన్స్‌ విభాగం బాధ్యతలు చేపట్టనున్నారు. >> జి.పరమేశ్వర : ఉపముఖ్యమంత్రి పదవితోపాటు బెంగళూరు ఇన్‌ఛార్జిగా కాంగ్రెస్‌ నేత వ్యవహరించనున్నారు. >> కుమార స్వామి సోదరుడు రేవణ్ణకు పబ్లిక్‌ వర్క్స్‌ మంత్రిత్వ శాఖ అప్పగించారు. >> సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఆర్వీ దేశ్‌ పాండేకు పరిశ్రమల శాఖ.. మరో కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు వైద్య విద్య, నీటిపారుదల శాఖ, కేజే జార్జ్‌కు ఐటీ, బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు అప్పగించారు. >> ఈసారి కర్ణాటక కేబినెట్‌లోకి కేవలం ఒకే ఒక మహిళ మాత్రమే అడుగు పెట్టారు. నటి జయమాలకు రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతికశాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ పదవుల కేటాయింపులో ఇప్పటికే కాంగ్రెస్‌ నేతల్లో తీవ్ర అంసంతృప్తి నెలకొంది. ఇంతకుముందు కాంగ్రెస్‌ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన రామలింగా రెడ్డికి ఈసారి మంత్రి వర్గంలో చోటు లభించలేదు. హెచ్‌కే పాటిల్‌, రోషన్‌ బేగ్‌లది ఇదే పరిస్థితి. అయితే కాంగ్రెస్‌ చేతిలో ఇంకా ఆరు పదవులున్నాయి. మరి వాటిని ఆ పార్టీ నేతలు ఎలా భర్తీ చేస్తారో చూడాలి.