నగదు చెల్లించండి... ఫుడ్ తీసుకోండి..

SMTV Desk 2018-06-09 16:11:01  indian railways, indian railways vending machine, food vending machine, tablet operating machine

ఢిల్లీ, జూన్ 9 : ఇండియన్ రైల్వేస్‌ ప్రయాణికులు సౌలభ్యం మేరకు ఓ సరికొత్త ఆటోమేటిక్‌ ఫుడ్‌ వెండింగ్‌ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేస్‌ తొలిసారిగా ట్యాబ్లెట్‌ ఆపరేటింగ్‌తో పనిచేసే ఆటోమేటిక్‌ ఫుడ్‌ వెండింగ్‌ మెషీన్‌ను మొదలుపెట్టింది. కోయంబత్తూర్‌-బెంగళూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. రైల్వే ప్రయాణికులకు అవసరమయ్యే తినుబండారాలైన బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌/కుర్‌కురే వంటి పదార్థాలన్నీ ఈ వెండింగ్‌ మెషీన్‌ ద్వారా పొందవచ్చు. దీంతో పాటు శీతల పానీయాలు, కాఫీ, టీ, ఫ్రూట్‌ జ్యూస్‌ కూడా వచ్చే విధంగా ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసింది. వ్యాపారాల నిమిత్తం ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వెండింగ్‌ మెషీన్‌ వద్ద ఉండే ట్యాబ్లెట్‌ ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారపదార్థాలను కొనుగోలు చేసుకోవచ్చు. ట్యాబ్లెట్‌తో తమకు కావాల్సిన పదార్థాలను ఎంపిక చేసుకొని వాటికి సరిపడా నగదు చెల్లిస్తే వెంటనే మెషీన్‌ ద్వారా తినుబండారాల ప్యాకెట్లు బయటకు వస్తాయి. కాఫీ, టీ కూడా అదే విధంగా ఆప్షన్లు ఎంపిక చేసుకుని నగదు చెల్లిస్తే ప్రయాణికులకు లభిస్తాయి. ప్రస్తుతం నగదు చెల్లింపు ద్వారా మాత్రమే దీన్ని నిర్వహిస్తున్నారు. త్వరలోనే నగదు రహిత చెల్లింపులు జరిగేలా ఏర్పాటు చేస్తామని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.