ఇంగ్లీష్ గడ్డపై టీమిండియానే ఫేవరెట్‌ : దాదా

SMTV Desk 2018-06-09 14:44:06  Sourav Ganguly , sourav ganguly about england tour, england vs india, kohli, arjun tendulkar

ఢిల్లీ, జూన్ 9 : టీమిండియా క్రికెట్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్ లో ఇంగ్లీష్ గడ్డపై టీమిండియానే ఫేవరెట్‌ అని మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ అంటున్నాడు. ఈ పర్యటనలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్‌ టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. జులై 3 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ.." బ్రిటిష్ జట్టుపై భారత్ జట్టు గెలుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌లో కోహ్లీ సేన ప్రదర్శన చూసి నేను ఈ మాట చెబుతున్నాను. ఇలాంటి ప్రదర్శననే వారు ఇంగ్లాండ్‌ పర్యనటలో పునరావృతం చేస్తే గెలుపు మనదే. కొద్ది రోజుల క్రితం పాక్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. పాకిస్థాన్‌ కంటే మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. కాబట్టి భారత్‌కు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి" అని గంగూలీ వ్యాఖ్యానించాడు. అండర్‌-19 భారత జట్టులో అర్జున్‌ తెందుల్కర్‌ చోటు దక్కించుకోవడంపై స్పందిస్తూ.."ముందుగా అర్జున్‌కు శుభాకాంక్షలు. అతను ఆడటం నేను ఇప్పటి వరకు చూడలేదు. బాగా రాణిస్తాడనే అనుకుంటున్నా" అని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.