ఓలా...ఎందిలా..

SMTV Desk 2018-06-09 12:41:43  ola cabs late, ola driver rash reply in hyderabad, hyderabad, shmshabad airport

హైదరాబాద్, జూన్ 9 : రెండేళ్ల తర్వాత దేశానికి వచ్చి, కుటుంబీకులను ఎప్పుడెప్పుడు కలుద్దామా అనే తొందరలో ఉన్న ప్రయాణికుడికి గంటన్నర పాటు చేదు అనుభవం ఎదురైంది. ఇంటికి వెళ్లాలని క్యాబ్‌ బుక్ చేసుకొన్నా సదరు ప్రయాణికుడికి డ్రైవర్లు చుక్కలు చూపెట్టారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం రాజీవ్‌గాందీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రాంగంణంలోని సీ పార్కింగ్‌ వద్దనున్న ఓలాజోన్‌ ప్రాంతంలో జరిగింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌ ఫలక్‌నుమాకు చెందిన ఓ ప్రయాణికుడు సౌదీ అరేబియా నుంచి శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ద్వారా ఉదయం 10గంటలకు వచ్చాడు. ఇంటికి వెళ్లేందుకు ఓలా ట్యాక్సీని బుక్‌ చేసుకున్నాడు. ఓలా కంపెనీ తరఫున (సీఆర్‌ఎన్‌ 1926788703) కన్ఫర్మేషన్‌తో పాటు వాదిత్య శంకర్‌ అనే డ్రైవర్‌ పేరు, ఫోన్‌ నెంబర్‌ వివరాలు పంపించింది. కొద్ది సేపటి తర్వాత డ్రైవర్‌ ఫోన్‌ చేసి ఎక్కడికి వెళ్లాలి? క్యాష్‌ ఉందా? ఆన్‌లైనా? అనే ప్రశ్నలు వేసి ఫోన్‌ పెట్టేశాడు. కొద్ది సేపటికే తన బుకింగ్‌ రద్దు అయినట్టు సందేశం వచ్చింది. దీంతో అతను మరోసారి బుక్‌ చేశాడు. ఈ సారి (సీఆర్‌ఎన్‌ 1926813912) కన్ఫర్మేషన్‌తో పాటు కంబళపల్లి రాంబాబు డ్రైవర్‌ వివరాలు వచ్చాయి. మళ్లీ మామూలే... అవే ప్రశ్నలు తిరిగి బుకింగ్‌ క్యాన్సిల్‌ అయింది. రెండు క్యాన్సిలేషన్‌లు గమనించిన తర్వాత ఓలా తరఫున మూడో డ్రైవర్‌ ఫోన్‌ చేసి అవే వివరాలు అడిగి ఫోన్‌ పెట్టేశాడు. దీంతో విసుగెత్తిన బాధితుడు ఓలా జోన్‌లో ఉన్న సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వారూ దురుసుగా మాట్లాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చేలోగానే ప్రయాణికులతో రాజీ కుదుర్చుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలో ఓలా జోన్‌ ఇన్‌చార్జి జహీర్‌ వచ్చి ప్రయాణికుడిని సముదాయించాడు. తమ డ్రైవర్లు, సిబ్బందితో తప్పు జరిగిందని క్షమాపణలు కోరాడు. దీంతో ప్రయాణికుడు ఫిర్యాదు వాపస్‌ తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ఓలా కాల్‌సెంటర్‌లో ఫిర్యాదు చేయడంతో విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రయాణికుడు వెల్లడించాడు.