కివీస్ అమ్మాయిలు కుమ్మేశారు..

SMTV Desk 2018-06-09 10:54:39  newzealand womens team record, newzealand vs ireland, kiwis cricket team, dublin

డబ్లిన్‌, జూన్ 9 :వన్డేల్లో 500 దగ్గరలో పరుగులు అంటే అది గొప్ప విషయమే.. కానీ ఆ ఘనతను మహిళా క్రికెట్ జట్టు సాధించింది. న్యూజిలాండ్‌ మహిళల జట్టు దాదాపుగా ఈ భారీ స్కోర్ చేసి చూపించింది. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న మహిళా క్రికెట్‌లో ఈ రికార్డు పెనుసంచలనం అనే చెప్పాలి. . 500 పరుగుల మైలురాయిని చేరలేకపోయినా అతి చేరువగా వచ్చి కొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది. కివీ బ్యాట్స్‌మన్‌ జోరుకు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 490 పరుగులు నమోదయ్యాయి. వన్డే క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు కాగా... పురుషుల వన్డేల్లో అత్యధిక స్కోరు 444 (ఇంగ్లండ్‌) పరుగులు మాత్రమే కావడం విశేషం. అనంతరం ఐర్లాండ్‌ 144 పరుగులు మాత్రమే చేసి 346 పరుగులతో దారుణంగా ఓటమి చవిచూసింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్‌ జట్టు బ్యాటింగ్ ఎంచుకొంది. బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్‌ జట్టులో మొదట కెప్టెన్‌, ఓపెనర్‌ సుజీ బేట్స్‌ (151; 94 బంతుల్లో 24×4, 2×6)తో పాటు మ్యాడీ గ్రీన్‌ (121; 77 బంతుల్లో 15×4, 1×6), అమీలా కేర్‌ (81 నాటౌట్‌; 45 బంతులోల 9×4, 3×6)ల మెరుపులతో కివీస్‌ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 490 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ జట్టు 144 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో కాస్పరెక్‌ (4/17), రోవ్‌ (2/23)ల ధాటికి ప్రత్యర్థి జట్టు కకావికలమయ్యింది. దీంతో ఆ జట్టు 35.3 ఓవర్లకు 144 ఆలౌటైంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదిక గా 1997లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌ మహిళల జట్టు 5 వికెట్లకు 455 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.