జడేజా అబద్ధాలు ఎక్కువ చెబుతాడు : భువనేశ్వర్‌

SMTV Desk 2018-06-08 17:00:00  Bhuvneshwar Kumar, jadeja , Bhuvneshwar Kumar interview, jadeja, indian cricket player bhuvi

ఢిల్లీ, జూన్ 8 : టీమిండియా క్రికెట్ జట్టులో కోహ్లీ అంటే జడేజాకు భయమని.. అంతే కాకుండా జడేజా ఎక్కువగా అబద్ధాలు చెబుతాడని స్వింగ్ కింగ్ భువనేశ్వర్‌ అన్నాడు. తాజాగా ఓ వెబ్‌ షోలో పాల్గొన్న భువి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. "జడేజాకు కోహ్లీ అంటే చాలా భయం. కోహ్లీ తన చుట్టుపక్కల ఉన్న సమయంలో జడేజా ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. భారత క్రికెటర్లలో ఎక్కువగా రవీంద్ర జడేజా అబద్ధాలు చెబుతూ ఉంటాడు. ఈ విషయం జట్టులోని సభ్యులందరికీ తెలుసు. కోహ్లి ఉన్నప్పుడు జడేజా చాలా తక్కువగా మాట్లాడతాడు. ఎందుకంటే.. ఒకవేళ అబద్ధం చెప్పినట్లు కోహ్లీకి తెలిస్తే బాగా ఆటపట్టిస్తాడు. ఇంకా శిఖర్‌ ధావన్‌కు ఏమి చెప్పినా గుర్తుండదు. ఒక్కోసారి జట్టు సభ్యుల పేర్లు కూడా మర్చిపోతుంటాడు. ఎంతలా అంటే అందరం కలిసి భోజనం చేసేందుకు డైనింగ్‌ టేబుల్‌పై కూర్చుంటే మరో ఎండ్‌లో ఉన్న ఆటగాడి పేరు గుర్తుండదు" అని భువి వ్యాఖ్యానించాడు. సచిన్ ను చూసి ఏమి మాట్లాడలేకపోయా.. "తొలిసారి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ను చూసినప్పుడు నేను ఏమీ మాట్లాడలేకపోయా. దేశవాళీ మ్యాచ్‌ కోసం స్టేడియంకు వెళ్లేందుకు నేను గదిలో నుంచి బయటకు వచ్చాను. ఇంతలో ఎవరో వచ్చి గది తలుపు తాళాలు వేసిన శబ్దం వచ్చింది. ఎవరా? అని వెనక్కి తిరిగి చూస్తే.. సచిన్‌. మొదటిసారి సచిన్‌ను చూడటం అప్పుడే. ఇద్దరం కలిసి లిఫ్ట్‌ ఎక్కి కిందకు వెళ్తున్నాం. ఆ సమయంలో నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. సచిన్‌ మాత్రం నన్ను విష్‌ చేశారు. అప్పుడు జరిగిన మ్యాచ్‌లో నేను సచిన్‌ను డకౌట్‌ చేశాను. భారత్ జట్టులో చోటు దక్కిన కొత్తలో నేను డ్రస్సెంగ్‌ రూమ్‌లో పెద్దగా ఏం మాట్లాడేవాడిని కాదు. చాలా కామ్ గా ఉండేవాడిని. ఏదైనా చెప్పాల్సి వస్తే ఇషాంత్‌ శర్మకు చెప్పేవాడిని" అని భువనేశ్వర్‌ తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు.