ఎస్‌బీఐ చార్జీల మోత

SMTV Desk 2017-07-12 12:22:25  KOLKATTA, GST, SBI, ARUNDATHI BATTAACHAARYA, BANK, ONLINE TRANSACTIONS.

కోల్‌కత్తా జూలై 12 : జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక అందుకు అనుగుణంగా అనేక బ్యాంకులు తాము అందించే సేవలపై రుసుములను సవరిస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను మరోసారి ఛార్జీలతో మోత మోగిస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా చేసే నగదు బదిలీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)తోపాటు అదనంగా రుసుములు వసూలు చేయనుంది. ఆర్థికసేవలపై జీఎస్‌టీ 18 శాతంగా ఉండడంతో, ఐఎంపీఎస్‌ (సత్వరమే నగదు బదిలీ) కింద రూ.1000 వరకు నగదు బదిలీపై ఎటువంటి ఛార్జీ ఉండదు. రూ.1,001-1,00,000లోపు బదిలీలపై జీఎస్‌టీ కింద రూ.5 వసూలు చేయనుంది. రూ.1,00,001-2,00,000 వరకు జీఎస్‌టీకి అదనంగా రూ.15 వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. మంగళవారం జరిగిన ఫక్కి కార్యక్రమంలో ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ... "మనదేశంలో బ్యాంకులకు బకాయిలు పడిన వారిని నేరస్తులుగా చూస్తున్నారు. తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడానికి ఎవరికీ హక్కు ఉండదు. ఇందుకు సమాజం కూడా ఒప్పుకోదు. అయితే ఒకోసారి బాకీలు కట్టలేని పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇవాళ రుణాలను రాబట్టుకోలేక పోతున్నాయని బ్యాంకులను నిందిస్తున్నారు. అప్పు ఇచ్చేటప్పుడు ఇవి వెనక్కి రావని ఎవరైనా అనుకుంటారా? అటువంటి పరిస్థితులు తలెత్తుతాయని ఊహిస్తారా? " అని ప్రశ్నించారు. ఆర్థిక మందగమనంతో మన వృద్ధి రేటు, వినియోగం బాగా తగ్గాయి. ఫలితంగా నిరర్థక ఆస్తులు కుప్పలుగా పెరిగాయి. ప్రస్తుతం వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే అందుకు తగినట్లుగానే రుణాలకు గిరాకీ పెరగట్లేదని తెలిపారు. గతంలో మాదిరిగా ఇప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకునే పరిస్థితి లేదు. అవసరమైన మేరకు ప్రొబెషనరీ ఆఫీసర్లను తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.