కమిషనర్‌ కూతురని చెప్పారు.. కటకటాలపాలయ్యారు..

SMTV Desk 2018-06-08 15:14:46  crime news, crime news in vishakapatnam, beauty parlour issue, ci m.venkat naidu

అల్లిపురం, జూన్ 8 : పోలీస్ కమిషనర్ కూతురిని అని చెప్పి బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులకు టోకర వేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. కమిషనర్‌ కూతురిని అంటూ బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులను బెదిరించి రూ.12వేలు ఖరీదు చేసే మేకప్‌ చేయించుకుని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన యువతికి నోటీసులు జారీ చేసిన మహారాణిపేట పోలీసులు.. అందుకు ప్రోత్సహించిన యువకుడిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. సీఐ ఎం.వెంకట నారాయణ సమాచారం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటకు చెందిన గంగులి కిరణ్‌కుమార్‌ బుధవారం నగరానికి చేరుకుని జగదాంబ కూడలిలో గల గ్రేస్‌ బ్యూటీ పార్లర్‌కు ఫోన్‌ చేశాడు. కమిషనర్‌ కుమార్తె ఒకరు మీ బ్యూటీపార్లర్‌కు వస్తున్నారని, ఆమెకు మేకప్‌ చేసి పంపించండి అని చెప్పాడు. అనంతరం ఆ యువకుడే ఓ యువతిని బ్యూటీ పార్లర్‌కు తీసుకొచ్చాడు. కమిషనర్‌ కుమార్తె అని భావించిన బ్యూటీ పార్లర్‌ సిబ్బంది మేకప్‌ చేసి రూ.12వేలు బిల్లు వేశారు. దీంతో సదరు యువతి యువకుడి సాయంతో నిర్వాహకులను బెదిరించింది. తాను కమిషనర్‌ కుమార్తెను అని చెప్పి విజయనగరం ఎస్పీ ఫొటో చూపించి బిల్లు ఎగ్గొట్టేందుకు యత్నించింది. దీంతో బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు జీవీఆర్‌ రమాదేవి డయల్‌ 100కు ఫోన్‌ చేయటంతో మహారాణిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మోసానికి ప్రోత్సహించిన యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.