సమ్మెబాట తగదు.. మరోసారి ఆలోచించండి..

SMTV Desk 2018-06-08 12:40:03  tsrtc strike issue, ts minister mahendra reddy, tmu leader, hyderabad

హైదరాబాద్‌, జూన్ 8 : ఆర్టీసీకి సుమారు రూ.3వేల కోట్ల అప్పు ఉందని.. దానికి ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ కడుతున్నామని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున సమ్మెపై కార్మిక సంఘాలు పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ నేతలతో ఈరోజు మంత్రి భేటి అయ్యారు. సంస్థకు ఏటా రూ.700కోట్ల నష్టం వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు పెంచితే సంస్థపై అదనంగా రూ.1,400 కోట్లు భారం పడుతుందని తెలిపారు. కార్మికులతో పాటు 4.5కోట్ల ప్రజల ప్రయోజనాలు ప్రభుత్వాన్వకి ముఖ్యమని స్పష్టం చేశారు. సంస్థను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని.. కార్మికులు తప్పుడు ఆలోచనలతో సమ్మెకు దిగడం సరికాదని ఈ సందర్భంగా మంత్రి కోరారు. దీనిపై టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ... ఇప్పటికైతే సమ్మె వాయిదా వేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం కార్మిక సంఘాలతో సమావేశమై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీ నూటికి నూరుపాళ్లు లాభాలతో నడిచే సంస్థ అని అన్న అశ్వత్థామరెడ్డి.. తమ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదన్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఇటీవల ప్రకటించింది. సమస్యల పరష్కారానికి సమ్మె తప్ప వేరే మార్గం లేదనే నిర్ణయానికి వచ్చిన కార్మిక సంఘాల నేతలు ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు వెల్లడించారు.