జగన్ తో భేటి అయిన రమణ దీక్షితులు..

SMTV Desk 2018-06-07 17:50:17  jagan vs ramana Deekshuthulu, ramana deekshuthulu, ysrcp jagan, tdp ttd dispute

హైదరాబాద్, జూన్ 7 : ప్రతిపక్ష నేత జగన్‌తో తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు భేటి అయ్యారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి రమణ దీక్షితులు వెళ్లారు. అక్కడ జగన్ తో 20 నిమషాలు చర్చ జరిగినట్లు సమాచారం. టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారని ఆయన ఆరోపించారు. టీటీడీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన సిబ్బంది వల్ల అర్చకులంటే చులకున భావన ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ లబ్దితో ఇక్కడకు రాలేదని మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చానని దీక్షితులు వెల్లడించారు. తిరుమలలో అర్చకుల మాటకు విలువ లేదని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. అపచారాల వల్ల స్వామి వారి తేజస్సు తగ్గిపోతోందని, స్వామి వారి తేజస్సు తగ్గితే భక్తులకు స్వామి అనుగ్రహం దొరకదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. నాపై ఆరోపణలు చేసిన వారు సిద్ధమా? జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులు టీటీడీకి పట్టిన ఏలినాటి శనిలాంటి వారు. బాలసుబ్రమణ్యం హయాంలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేశారు. మా కష్టాలు చెప్పుకోవాలని సీఎంను కలవాలని ప్రయత్నించాను. కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు" అని వ్యాఖ్యానించారు.