జనతాదళ్ లో జగడం...!

SMTV Desk 2018-06-07 14:31:49  janata dal, hd, deva gowda, congress-jds, ids party

బెంగళూరు, జూన్ 7 : కర్ణాటక రాజకీయాల్లో పదవుల పంపకంపై జేడీఎస్‌ పార్టీలో జగడం మొదలైంది. మంత్రి వర్గంలో కొందరికి స్థానం లభించక పోవటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం అందుకొన్నారు. దీంతో వారిని దేవేగౌడ అనునయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన మొత్తం 38 మంది ఎమ్మెల్యేల్లో 11 మందికి మాత్రమే మంత్రి పదవులు లభించాయి. మిగిలిన వారిలో సీనియర్లు, పరిపాలనలో అనుభవాన్ని గడించిన వారు నాయకత్వం పట్ల అసహనంతో ఉన్నారు. తుమకూరు జిల్లాకు చెందిన సత్యనారాయణ, గౌరిశంకర్‌ తమ అసంతృప్తిని తెలియపరిచారు. సింధగి, మద్దూరు ఎమ్మెల్యేలు తమ్మణ మనుగోళి బుధవారం ఉదయం కూడా తమకు మంత్రి పదవులు కావాలని డిమాండు చేశారు. తమ్మణ్న అనయాయులు స్వస్థలంలో రాస్తోరోకో నిర్వహించారు. మనుగోళి ఏకంగా దేవేగౌడ నివాసం ఎదుట కార్యకర్తలతో కలసి భైఠాయించారు. చివరకు వారిద్దరినీ మంత్రిపదవి వరించింది. రాజ్యసభకు రెండుమార్లు పోటీ చేసి పరాజయం పాలైన ఫరూఖ్‌ ఇటీవల ఎగువసభ ఎన్నికల్లో గెలిచారు. ఆయనా మంత్రిపదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎగువసభ సభ్యులు శరవణ, బసవరాజహొరట్టి ఆవేదన అంతా ఇంతా కాదు. ఏకంగా ఎగువసభ సభ్యులకు మంత్రి పదవులు లేనేలేవని దేవేగౌడ కుండబద్ధలు కొట్టి ప్రకటించడంతో వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు.