పసికందు అని కూడా చూడకుండా...

SMTV Desk 2018-06-07 13:15:23  infant baby, women leaves a newborn baby on road, uttara pradesh incident,

హైదరాబాద్, జూన్ 7 : పొత్తిళ్ళలో ఉండాల్సిన పసికందును నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేశారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఓ కారు వెళ్తూ ఉంది. ఇంతలో ఆ కారును ఒక ఇంటి ముందు ఆపి గుర్తు తెలియని మహిళ కారు కిటికీలో నుంచి.. వస్త్రంలో చుట్టి ఉన్న చిన్నారిని ఓ ఇంటి ఎదుట వదిలేసింది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీటీవీలలో రికార్డయింది. ఆ తర్వాత చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు వెళ్లి ఆ పాపను తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వెల్లడించారు. అయితే ఇందుకు కారణమైన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.