జాత్యహంకార ఘటనకు 125 ఏళ్లు..

SMTV Desk 2018-06-07 12:39:55  Mahatma Gandhis Satyagraha, Mahatma Gandhis south africa, south africa mahatma gandhi, sushma swaraj

దక్షిణాఫ్రికా, జూన్ 7 : భారతదేశం.. ఇండియా.. పేరు ఏదైతేనేం.. కోట్లాది మంది హృదయాలను పులకింపజేసే పేరిది. సుమారు 130 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా విలసిల్లుతోంది. ఇప్పటి ఈ స్వేచ్చకు ఎంతో మంది మహానుభావులు ప్రాణాలను త్యజించి తెల్లదొరల బానిసత్వ కోరల నుండి భారతీయులను విముక్తి చేశారు. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవలసిన పేరు మహాత్మా గాంధీ. సత్యం, శాంతి, అహింస అనే మూడు అంశాలను తన ఆయుధంగా మలుచుకొన్న ధీరదత్తుడు. ఆవేశం లేకుండా.. ఆలోచనతో.. శాంతితో.. ఉక్కు సంకల్పమే పరమావధిగా ప్రాణాలకు లెక్కచేయని తత్వంతో ముందుకు సాగడమే సత్యాగ్రహం..! రక్తం చిందకుండా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఆయుధం! మనిషిని మహాత్ముడిని చేసిన తారక మంత్రం! గాంధీజీని ‘సత్యాగ్రహి’ని చేసిన ఆ చారిత్రక ఘటనకు నేటితో 125 ఏళ్లు! ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో రెండు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1893 జూన్‌ 7న ఏ రైలు నుంచి మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీని మెడపట్టి తోసేశారో.. ఏ పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌పై ఆ యువ న్యాయవాది పడిపోయారో..ఆ రైలును, స్టేషన్‌ను ఖాదీతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇందుకోసం ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రియల్‌ కమిషన్‌ 400 మీటర్ల ఖాదీని అందించింది. సత్యాగ్రహ ఉద్యమానికి నాంది పలికిన ఆ సంఘటనను గుర్తుచేస్తూ.. దక్షిణాఫ్రికాలోని భారత హై కమిషనర్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విదేశాంగమంత్రి సుష్వా స్వరాజ్‌ హాజరవుతారు. దక్షిణాఫ్రికాలోని ప్రముఖ రాజకీయ నాయకులు సహా 300 మంది ప్రముఖులతో కలిసి పెంట్రిచ్‌ స్టేషన్‌ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ స్టేషన్‌ వరకూ.. ఖాదీతో అలంకరించిన రైలులో ప్రయాణిస్తారు. అలాగే.. రెండువైపులా గాంధీజీ ముఖం కనిపించే ఒక విగ్రహాన్ని స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై ఆవిష్కరిస్తారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ మ్యూజియంను కూడా ప్లాట్‌ఫాంపై ఆవిష్కరించనున్నారు.