భారతీయులు 12 ఏళ్ళ వరకు ఆగాల్సిందే!

SMTV Desk 2017-07-12 10:19:42  amerikaa, indians, visa, greencard, americaa citizen ship

వాషింగ్టన్ జూలై 12 : అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు పొందాలంటే, భారతీయ ఉద్యోగులు 12 ఏళ్ళ వరకు నిరీక్షించాల్సిందే! గ్రీన్ కార్డు పొందే విదేశీయుల్లో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారని తాజా నివేదికల్లో వెల్లడైంది. 2005లో భారతీయ ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతోందని పీఈడబ్లు రీసెర్చ్‌ సంస్థ వెల్లడించింది. 2010-14 ఆర్థిక సంవత్సరాల్లో ఉద్యోగ సంబంధిత హెచ్‌-1బి వీసాలు పొందిన వారిలో 2,22,000 (36శాతం)మందికిపైగా గ్రీన్‌కార్డులు మంజూరయ్యాయి. 2015లో 36,318 మంది భారతీయులు శాశ్వత నివాస హోదాకు మారారు. మరో 27,798 మంది గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను పొందారని ఆ సంస్థ పేర్కొంది. గ్రీన్‌కార్డు పొందిన అయిదు ఏళ్ల తర్వాత అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికన్‌ పౌరులను వివాహమాడితే మూడేళ్లలోనే పౌరసత్వం పొందే వీలుంది. అమెరికాలో శాశ్వత నివాసం పొందటానికి, ఉద్యోగం చేసుకోవటానికి అవసరమైన అధికారిక హోదాను వలస వచ్చిన వ్యక్తులకు గ్రీన్‌కార్డు కల్పిస్తుంది. 2015లో కొత్తగా వచ్చిన 5,08,716 మందికి గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్దమైన శాశ్వత నివాస హోదా లభించగా, 5,42,315 మంది తమ నివాస హోదాలో మార్పు చేసుకున్నారు. 2004 నుంచి మొత్తం 74 లక్షల మంది తమ నివాస హోదాలను మార్చుకున్నారు. కొత్తగా వచ్చిన 55 లక్షల మంది గ్రీన్‌కార్డు రూపంలో శాశ్వత నివాస హోదాను పొందారు. 2015లో ఉద్యోగుల విభాగంలో 14 శాతం గ్రీన్‌కార్డులు కుటుంబ సభ్యులకు మంజూరయ్యాయి. గ్రీన్‌కార్డుల్లో 11శాతం శరణార్థులకు, 3శాతం ఆశ్రితులకు ఇచ్చారని పరిశోధన సంస్థ పేర్కొంది.