సినిమా టికెట్స్ సర్కారీ సైట్లోనే..

SMTV Desk 2018-06-06 15:16:03  movie tickets, government website, online ticket booking.

హైదరాబాద్, జూన్ 6 : ప్రస్తుత కాలంలో సినిమా చూడాలంటే వారం రోజుల ముందుగానే నచ్చిన థియేటర్‌లో ఆన్‌లైన్‌ టికెట్లు బుక్‌ చేసేసుకుంటున్నారు. సర్వీస్ ఛార్జీలకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇప్పుడు ఇదే పెద్ద వ్యాపారం అయింది. ఈ ఆన్‌లైన్‌ బుకింగ్ కి భారీ డిమాండ్ ఉండడంతో ఈ వ్యాపారంలోకి అనేక పెద్ద కంపెనీలు ప్రవేశించాయి. సాధారణంగా ఒక్కో టికెట్‌పై పలు సంస్థలు రూ.20 నుండి 50 వరకు అదనపు వసూలు చేస్తున్నాయి. సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యాజమాన్యాలతో పోలిస్తే ఆన్‌లైన్‌ టిక్కెట్లు అందిస్తున్న కంపెనీలు భారీగానే లాభపడుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) ఓ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఒక్కో టికెట్‌పై కనీసం రూ.20 వసూలు చేస్తుండగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5-7కే అందించవచ్చని సంస్థ పేర్కొంది. వాస్తవానికి పలు ప్రైవేట్ కంపెనీలు థియేటర్‌ యాజమాన్యాలను సంప్రదించి 50 వరకు టికెట్లు ముందుగానే పొందుతున్నాయి. ఈ టికెట్లను ముందుగానే విక్రయించకుండా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఆ టికెట్లను చివరి నిమిషంలో అమ్ముతూ భారీగా సర్వీస్‌ చార్జీని వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలని టీఎస్ఎఫ్డీసీ ప్రతిపాదించింది. ఏడాది క్రితమే ఈ ప్రతిపాదనను పంపగా టెండరు విషయం కాస్త కోర్టుకు వెళ్లడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ విషయంపై 15 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు కోర్టు సానుకూలంగా స్పందిస్తే తెలంగాణ.. దేశంలోనే ఈ సేవలందించే తొలి రాష్ట్రంగా నిలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న థియేటర్లన్నింట్లోని టికెట్లను ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారానే విక్రయి౦చవచ్చు. దీంతో ప్రేక్షకులపై అదనపు భారం తగ్గుతుంద౦టూ టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ పి.రామ్మోహన్‌రావు తెలిపారు.