వైసీపీ ఎంపీల రాజీనామాకు గ్రీన్ సిగ్నల్..!

SMTV Desk 2018-06-06 12:26:15  YSRCP MPs resignation, ap mps ycp leadres resign, ap, mps on parliament

న్యూఢిల్లీ, జూన్ 6 : ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వై‌సీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఎంపీలు పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరగా అందుకు ఆమె అంగీకరించారు. నేటి ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఏపీలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అలాగే, పార్టీ మారిన మరో ముగ్గురు తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు (బుధవారం) సాయంత్రం లేదా రేపు (గురువారం) ఉదయం వెలువడవచ్చునని తెలుస్తోంది. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా తాము పదవులకు రాజీనామా చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదించాలని ఆమెను కోరామని ఎంపీలు వెల్లడించారు. తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. తుది నిర్ణయం ఇదేనా అని స్పీకర్‌ అడిగితే.. అవునని సమాధానం చెప్పగా రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు ఆమె చెప్పారని ఎంపీలు వివరించారు. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పీకర్‌కు చెప్పామని, దీంతో ఆమె రీకన్ఫర్మేషన్ లేఖలు ఇస్తున్నామని, దీంతో వాటిని ఇస్తే రాజీనామా ఆమోదిస్తానని ఆమె చెప్పారని వైసీపీ ఎంపీలు చెప్పారు. రీకన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వగానే అధికారికంగా ప్రకటన వెలువడుతుందన్నారు.