పాక్ కవ్వింపు చర్యలు ఉపేక్షించబోము : నిర్మలా సీతారామన్

SMTV Desk 2018-06-05 17:00:41  nirmala sitharaman, defence minister nirmala sitharaman, pakistan vs india, rafel jets

న్యూఢిల్లీ, జూన్ 4 : సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌కు ధీటైన బదులిస్తామని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రంజాన్‌ సందర్భంగా సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఉన్నా.. మన నుంచి ఎలాంటి కవ్వింపులు లేకుండా జరిగే దాడులను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు వివరించారు. పాక్‌తో సంబంధాలపై ఆమె స్పందిస్తూ.. ఉగ్రవాదం, చర్చలు ఒకే మార్గంలో సాగలేవన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ఓవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ‌.. మరోపక్క చర్చలంటే కుదిరే పని కాదు. ఉగ్రవాదం-చర్చలు ఒకే మార్గంలో సాగలేవు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలు. అలా కాదని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన జవాబిస్తాం. సరిహద్దులను సురక్షితంగా ఉంచటం మా బాధ్యత. భారత్‌ కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి కట్టుబడి ఉంది. అంతేగానీ కవ్వింపు చర్యలను ఉపేక్షించబోదు" అని పేర్కొన్నారు. అంతే కాకుండా రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారంపై ఆమె స్పందించారు. "రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారం, సంబంధాలు చాలా బలమైనవి. రాఫెల్ జెట్స్ కొనుగోళ్ళలో ఎటువంటి కుంభకోణం జరగలేదు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. యూపీఏ హయాంలో ఆయుధాల కొరత ఉండేది. కానీ, ప్రస్తుతం భద్రతా బలగాలకు ఆయుధాల కొరత లేదు. అవసరమైన ఆయుధాలు కొనే అధికారాన్ని సులభతరం చేశాం" అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.