ఎన్పీఏ ల భయం... మరో నాలుగు బ్యాంకుల వీలినం.. !

SMTV Desk 2018-06-05 14:21:33  banks merging, indians bank system, obc bank, punjab national bank

ముంబై, జూన్ 5 : ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ అతలాకుతలమవుతుంది. పెరిగిపోతున్న అప్పుల భారంతో పాటు డిపాజిట్లు లేక బ్యాంకులకు నగదు కొరత వేధిస్తుంది. బ్యాంకింగ్ రంగ ఉనికిని మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్ పీఏ) ప్రశ్నార్థకం చేస్తుండటం - వరుస కుంభకోణాలు మోసాలు వెలుగుచూస్తుండటంతో ప్రజలకు కూడా బ్యాంకింగ్ రంగంపై నమ్మకం సడలిపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నష్టాలను నివారించేందుకు నరేంద్ర మోదీ సర్కారు మళ్లీ దృష్టి సారించింది. గతేడాది ఏప్రిల్లో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)తోపాటు ఐదు అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో వీలినం విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 21కి చేరింది. తాజాగా ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) - ఐడీబీఐ బ్యాంక్ - ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ఒక్కటి చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ప్రపంచస్థాయి బ్యాంకుల నిర్మాణం కోసం భారీ ఏకీకరణ ప్రణాళికను రూపకల్పన చేసిన మోడీ సర్కారు.. ఏడాది క్రితం తొలి అడుగు ఎస్ బీఐతో వేసింది. ఇప్పుడు మలి అడుగును వేసే దిశగా వెళ్తుండగా ఇది సాకారమైతే దేశంలో ఎస్ బీఐ తర్వాత అతిపెద్ద బ్యాంకు అవతరించనుంది. ఈ విలీన బ్యాంక్ ఆస్తుల విలువ రూ.16.58 లక్షల కోట్లుగా ఉండనుంది. ఇదిలాఉండగా...ఆంధ్రా బ్యాంక్ - బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - దేనా బ్యాంక్ - పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ -విజయా బ్యాంక్ - యునైటెడ్ బ్యాంక్ లనూ విలీనం చేసే ప్రతిపాదనలున్నాయి. నిజానికి దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ)లో పలు బలహీన - నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బ్యాంకులను కలిపేయాలని మొదట్లో యోచించినా.. రూ.14600 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం కారణంగా పీఎన్ బీ చరిత్ర మసకబారిపోయింది. మరి ఈ వీలిన ప్రక్రియ నష్టాల్లో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని దారిలోకి తెస్తుందా..! బలహీన బ్యాంకులు అనవసర వ్యయాలను తగ్గించుకోవడానికి, నష్టాల్లోని శాఖలను మూసివేయడానికి ఈ విలీనం తోడ్పడగలదని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆయా బ్యాంకుల ఖాతాల్లో పెరిగిపోతున్న మొండిబాకీలను కట్టడి చేసేందుకు కూడా ఇది దోహదపడగలదని ప్రభుత్వం ఆలోచనలో ఉంది.