ఆ 4 రోజులు ఏడుస్తూనే ఉన్నాను : స్మిత్‌

SMTV Desk 2018-06-04 20:12:14  steve smith, ball tampering issue, steve smith, ball tamering issue

సిడ్నీ, జూన్ 4 : బాల్ టాంపరింగ్ వివాదం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికే తెలిసిందే. అయితే ఈ ఉదంతం చోటు చేసుకున్నాక నాలుగు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పాడు ఆసీస్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి స్మిత్‌. సోమవారం స్మిత్‌ సిడ్నీలోని ఓ పాఠశాలకు వెళ్లాడు. ఈ సందర్భంగా స్మిత్‌ మాట్లాడుతూ... " నిజం చెబుతున్నాను. బాల్‌ టాంపరింగ్‌ వివాదం అనంతరం ఆసీస్‌ చేరుకున్నాక... సుమారు నాలుగు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్లు నీటితో బరువుగానే ఉండేవి. మానసికంగానూ చాలా కుంగిపోయా. కానీ, నేను ఎంతో అదృష్టవంతుడ్ని. నా కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితులు ఆ సమయంలో నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాతో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవారు. నన్ను విడిచి దూరంగా వెళ్లిందే లేదు. నాకెంతో మద్దతుగా నిలిచారు. వారి సమయాన్నంతా నాతోనే గడిపారు. వారు అలా చూసుకున్నారు కాబట్టే నేను ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను" అని స్మిత్ పేర్కొన్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అయిన స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారు. ఈ వివాదంపై విచారణ చేపట్టిన క్రికెట్‌ ఆస్ట్రేలియా స్మిత్‌, వార్నర్‌పై ఏడాది నిషేధం విధించింది. దీంతో వీరిద్దరూ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యారు. కాగా తర్వలో వీరిద్దరూ తిరిగి క్రికెట్ ఆడనున్నారు. కెనడాలో జూన్‌ చివరి వారంలో ప్రారంభమయ్యే గ్లోబల్‌ టీ20లీగ్‌లో స్మిత్‌, వార్నర్‌ ఆడనున్నారు.