ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్‌ కుమార్‌ జైన్‌..

SMTV Desk 2018-06-04 15:51:08  rbi deputy governor, mk jain as rbi deputy governor, pnb, rbi

ముంబై, జూన్ 4 : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్‌ కుమార్‌ జైన్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ గవర్నర్‌గా జైన్‌ మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. జైన్‌ గతేడాది ఏప్రిల్‌ నుంచి ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా ఉన్నారు. అంతకుముందు 2013 సెప్టెంబరులో ఇండియన్‌ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జైన్‌ తన బ్యాంకింగ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సిండికేట్‌ బ్యాంక్‌లో జనరల్‌ మేనేజర్‌గా కూడా సేవలందించారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన ఎస్‌ఎస్‌ ముంద్రా పదవీకాలం గతేడాది జులైలో ముగిసింది. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. దీంతో కొత్త డిప్యూటీ గవర్నర్‌ కోసం ఇటీవల ఆర్‌బీఐ ఇంటర్వ్యూలు చేపట్టింది. ముగ్గురు సీనియర్‌ ప్రభుత్వ అధికారులు, ఆరుగురు బ్యాంకర్లను ఇంటర్వ్యూ చేసిన ఆర్‌బీఐ.. చివరకు జైన్‌ను ఎంపిక చేసింది.