భర్తే కాలయముడయ్యాడు..

SMTV Desk 2018-06-03 13:24:36  Madanapalle women lawyer murder, brutally murdered in chittor, madanapalli victim, women lawyer

మదనపల్లె : జిల్లాలోని మదనపల్లె పట్టణంలో సంచలనం రేపిన న్యాయవాది నాగజ్యోతి (45) హత్య కేసులో నిందితుడిని పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు. హతురాలి భర్తే ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ శనివారం పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ..." పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన న్యాయవాది జితేంద్ర కు 25 సంవత్సరాల క్రితం నాగజ్యోతితో వివాహమైంది. వీరికి అభిషేక్‌, నిఖిత ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా భార్యాభర్తలు కొన్ని కలహాల కారణంగా విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. ఇద్దరూ న్యాయవాదులుగా మదనపల్లె కోర్టులో ప్రాక్టీస్‌ చేసేవారు. ఎనిమిది నెలల క్రితం భర్త నుంచి తనకు ప్రాణహాని వుందంటూ నాగజ్యోతి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జితేంద్రను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఆ తరువాత కోర్టులో ఇద్దరూ తరచూ తారసపడడంతో పరస్పరం దూషించుకునేవారు. ఇదంతా నచ్చని జితేంద్ర ఎలాగైనా భార్యను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. హత్య కేసులో బెయిల్‌ కోసం సంప్రదించిన యువకుడి సాయంతో భార్య నాగజ్యోతిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. సుపారీ తీసుకున్న ఆ యువకుడు కొంతమంది యువకులతో కలసి మే 30న పథకం ప్రకారం ఎస్‌బీఐ కాలనీ విస్తరణ ప్రాంతంలో నాగజ్యోతిని హత్య చేశాడు. ఈ హత్యపై 4 బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణ ముమ్మరం చేశాం. అనుమానంపై హతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా తానే ఆ హత్య చేయించినట్లు జితేంద్ర ఒప్పుకున్నాడు. అయితే ఇతను ఎవరికి డబ్బు ఇచ్చాడో విచారణ చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తాం" అని డీఎస్పీ వెల్లడించారు అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఒక ఎస్సైని కూడా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం వీఆర్‌కు పంపామన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మహిళల కేసుల పట్ల నిర్లక్ష్యం వహించే పోలీసు సిబ్బందిపైనా చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.