సెలబ్రిటీలు Vs పోలీసులు..

SMTV Desk 2018-06-03 12:37:46  tollywood vs hyderabad police, tollywood cricket, hyderabad police, hpl league

హైదరాబాద్‌, జూన్ 3 : హైదరాబాద్‌లోని ఎల్బీ సేడియం వేదికగా పోలీస్‌ అధికారులు, సినీ తారలు ఆదివారం క్రికెట్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ పోలీసు క్రికెట్‌ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు... సినీ తారలతో ఎల్‌బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తలపడుతుందని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. ఇందులో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, యువ కథనాయకులు నాని, అఖిల్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు ఆడనున్నారని ఆయన అన్నారు. ప్రజలతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాలన్న లక్ష్యంతో రెండు నెలల క్రితం హెచ్‌పీఎల్‌ పేరుతో క్రికెట్‌ పోటీలను ప్రారంభించినట్లు అంజనీ కుమార్ తెలిపారు. జోన్ల వారీగా పోటీలను నిర్వహించగా... ఉత్తరమండలం, పశ్చిమమండలం జట్లు తుదిపోరుకు వచ్చినట్లు చెప్పారు. ఈ క్రికెట్‌ పోటీల్లో ప్రత్యక్షంగా 4వేల మంది యువకులు పాల్గొనగా 40వేల మంది తమకు సహకరించారన్నారు. ఈ మ్యాచ్‌ సందర్భంగా సాంస్కృతిక శాఖ నుంచి కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమానికి హోం మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నరని.. ప్రజలందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ఈ సందర్భంగా రూపొందించిన టీజర్‌ను ఆయన ఆవిష్కరించారు. స్టార్‌ ప్లేయర్లు వీరు... సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ జట్టు తరఫున నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి, అఖిల్, నాని, శ్రీకాంత్, విజయ దేవరకొండ, నితిన్‌ తదితరులు పాల్గొంటారు. వీరితో పోలీసు క్రికెట్‌ జట్టు తలపడనుంది.