అక్కడే స్పందిస్తా : మాజీ రాష్ట్రపతి

SMTV Desk 2018-06-02 19:21:22   Pranab Mukherjee, rss meeting Pranab Mukherjee, inc, rss meeting, new delhi

న్యూఢిల్లీ, జూన్ 2 : ఈనెల 7న నాగపూర్‌లో జరుగనున్న రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌వాది ప్రణబ్ ముఖర్జీ అంగీకరించడం తీవ్ర సంచలనం అవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రణబ్ ముఖర్జీ ముక్తసరిగా స్పందించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరుకావడంపై సదరు కార్యక్రమంలోనే స్పందిస్తానని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని సమ్మతించిన నేపథ్యంలో తర్వాత తనకు చాలా ఉత్తరాలు, ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని చెప్పారు. వేటికీ ఇంతవరకూ స్పందించలేదని వెల్లడించారు. ఈ మేరకు బెంగాల్‌ దినపత్రిక ఆనంద్‌ బజార్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. భారతీయ జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ)తో ప్రణబ్‌కు 50 ఏళ్ల అనుబంధం ఉంది. అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రణబ్ నిర్ణయంపై స్పందించకపోయినా, ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు ప్రణబ్‌ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పలువురు ఒక అడుగు ముందుకేసి ఈ మేరకు ఆయనకు లేఖలు రాసి, నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కూడా కోరారు. కాగా గొప్ప నేతలను, వ్యక్తులను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఇదేం కొత్తకాదు. గతంలో మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ్, జవహర్‌ లాల్‌ నెహ్రూలకు సైతం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాలు అందించింది.