ఆప్ తో పొత్తు దిశగా కాంగ్రెస్..!

SMTV Desk 2018-06-02 18:27:48  congress- aap, rahul gandhi, aravindh kejriwal, bjp, bsp

ఢిల్లీ, జూన్ 2 : అప్రహతిహతంగా దూసుకుపోతున్న బీజేపీ విజయాలకు అడ్డుకట్ట వేయాలన్న కాంగ్రెస్ ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే కూటమిగా ఏర్పడితే బీజేపీను ఓడించగలమనే నమ్మకం కలగడంతో రాహుల్ గాంధీ పొత్తులపై దృష్టిపెట్టారు. అందుకు నిదర్శనమే ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలందరూ ఒకే వేదికపైకి రావడం. కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించింది. ఇప్పుడు ఈ ఏడాదిలో చివరిలో జరగబోయే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌పార్టీ(బీఎస్పీ)తో చేతులు కలపాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. తాజాగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పొత్తు అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్‌, అజయ్‌ మాకెన్ గత నెల 24న ఆప్‌ నేతలను కలిసినట్లు తెలుస్తోంది. 5:2 నిష్పత్తిలో సీట్లు పంపకాలు చేసేందుకు ఆప్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. కానీ అందుకు కాంగ్రెస్‌ అంగీకరించడం లేదట. అయితే.. కాంగ్రెస్‌కు రెండు సీట్లకు మించి ఇచ్చేందుకు ఆప్‌ సుముఖంగా లేదని కనిపిస్తోంది.