అలిస్టర్‌ కుక్‌ @ 154 టెస్టులు..

SMTV Desk 2018-06-02 12:44:17  alistair cook, england cricketer, alistair cook test, pakistan- england

లీడ్స్, జూన్ 2 : ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్ టెస్టుల్లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డేలు, టీ-20 లకు గుడ్ బై చెప్పిన కుక్ కేవలం ఐదు రోజుల టెస్ట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. సాధారణంగా ఫిట్‌నెస్‌ సమస్యలు ఏదైనా ఇతర కారణాల వల్ల క్రికెటర్లు కొన్ని మ్యాచ్‌లకు అనుకోకుండా దూరం అవుతారు. కానీ, కుక్ మాత్రం ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ అవ్వకుండా వరుసగా 154 టెస్టులాడాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇది ఇప్పుడు సరికొత్త రికార్డు. 1979 నుంచి 1994 వరకు ఆస్ట్రేలియా తరఫున టెస్టులాడిన అలెన్ బోర్డర్‌ వరుసగా 153 టెస్టులాడి అప్పట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. తాజాగా ఆ రికార్డుని ఈ ఇంగ్లిష్ ఆటగాడు బద్దలుకొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌తో కుక్‌ ఈ రికార్డును సాధించాడు. కుక్‌ ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌ తరఫున 156 టెస్టులాడాడు. అయితే ఆ దేశం ఆడిన చివరి 154 టెస్టులను కనుక పరిశీలిస్తే కుక్‌ ప్రతి మ్యాచ్‌లోనూ ఉన్నాడు. 2006 మార్చిలో ఇంగ్లాండ్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన కుక్‌ తొలి మ్యాచ్‌ అనంతరం రెండు మ్యాచ్‌లకు మాత్రమే దూరమయ్యాడు. ఆ తర్వాతి నుంచి ఇంగ్లాండ్‌ ఆడే ప్రతి టెస్టులోనూ కుక్‌ చోటు దక్కించుకున్నాడు. కెరీర్‌లో టెస్టులో బ్రేక్ తీసుకోకుండా ఎక్కువ టెస్టులు ఆడిన బ్యాట్స్‌మెన్ జాబితాని ఓ సారి పరిశీలిస్తే.. అలిస్టర్ కుక్ (154), అలెన్ బోర్డర్ (153), మార్క్‌వా (107), సునీల్ గవాస్కర్ (106), బ్రెండన్ మెక్‌కలమ్ (101), ఏబీ డివిలియర్స్ (98), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (96), రాహుల్ ద్రవిడ్ (93) ఉన్నారు.