స్టెరిలైట్‌ నిషేధం.. ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరం..

SMTV Desk 2018-06-01 14:39:37  sterlite banned, sterlite emplyoees problems, tamilanadu sterlite, tuticoron

చెన్నై, జూన్ 1 : తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. స్టెరిలైట్‌ కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ గత కొంతకాలంగా స్థానికులు ఆందోళన చేశారు. కాగా ఇటీవల ఈ ఘటన హింసాత్మకంగా మారడంతో 13 మంది మరణించారు. దీంతో ఇది మరింత వివాదాస్పదంగా మారింది. విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్టెరిలైట్‌ పరిశ్రమ శాశ్వత మూసివేతకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 3వేల మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కంపెనీ మూసివేయడంతో తమకు పనిలేకుండా పోయిందని, కొంతమంది కంపెనీ గురించి అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేసింది. "గత మూడు వారాలుగా మా పక్కింటి వాళ్లు నన్ను హేళన చేస్తున్నారు. మరికొంతమంది ఎందుకు ఆ కంపెనీలో పనిచేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నా భర్త ఓ చిన్న వ్యాపారం చేస్తుంటారు. ఆయన సంపాదన ఇంటి ఖర్చుల వరకే సరిపోతుంది. నా కొడుకు ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ఇప్పుడు నేను పనిచేసే కంపెనీని మూసివేశారు. దీని వల్ల మేం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొంతమంది కంపెనీ గురించి అబద్ధపు ప్రచారం చేశారు. ప్రభుత్వం దీన్ని పరిశీలించి కంపెనీ మళ్లీ తెరిచే విధంగా చూడాలి" అని ఆ కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని కోరారు.