వరల్డ్ ఎలెవన్ పై కరేబియన్లదే విజయం..

SMTV Desk 2018-06-01 12:06:15  ICC World XI vs west indies, icc world X1 team, lords world X1, sahid afridi

లండన్‌, జూన్ 1 : లార్డ్స్‌ వేదికగా ప్రపంచ ఎలెవన్‌తో జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది ప్రపంచ ఎలెవన్‌కు సారథ్యం వహించాడు. తొలుత టాస్‌ గెలిచిన ఎలెవన్‌ జట్టు ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌ చేపట్టిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎవిన్‌ లూయిస్‌(58), శామ్యూల్స్‌(43), రామ్‌దిన్‌(44) రాణించడంతో ఆ జట్టు మంచి స్కోరు సాధించగలిగింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రపంచ ఎలెవన్‌ జట్టు నాలుగు పరుగుల వద్దే మొదట వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన ఏ ఆటగాడు క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు. ఏ దశలోనూ ఎలెవన్ జట్టు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. థిసరా పేరారా ఒక్కడే రాణించి 61 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో 127 పరుగులకు వరల్డ్‌ ఎలెవన్‌ చాప చుట్టేసింది. దీంతో ప్రపంచ ఎలెవన్‌ జట్టు 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. "ఎవిన్‌ లూయిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" అవార్డు దక్కింది. గతేడాది కరేబియన్‌ దీవుల్లో వచ్చిన తుపానుకు ధ్వంసమైన స్టేడియాల మరమ్మతుల కోసం ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చిన నగదును మరమ్మతుల కోసం వినియోగించనున్నారు.