మేఘాలయలో కన్నడ రాజకీయం రాబోతుందా..!

SMTV Desk 2018-05-31 19:49:15  congress in meghalaya, congress-ncp, congress, by poll elections in india

న్యూఢిల్లీ, మే 31 : తాజాగా వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కు చేదు అనుభవమే ఎదురైంది. 4లోకసభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కేవలం 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే సీటును బీజేపీ గెలుచుకుంది. దీంతో విపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మేఘాలయాలోని అంపతి అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంపటిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మియానీ డీ షిరా 3,191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా గెలుపుతో మేఘాలయలో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయాలో తాజా గెలుపుతో కాంగ్రెస్‌ సంఖ్యాబలం 21కి చేరింది. మరోవైపు అధికార ఎన్పీపీ 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. కర్ణాటక రాజకీయాలను మేఘాలయలో పునరావృతం చేసి.. విపక్షాల ఐక్యతతో మరో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజారిటీ సాధించలేదు. అయినా, గవర్నర్‌ వజుభాయ్‌ వాలా మొదట బీజేపీ నేత యడ్యూరప్పకు అవకాశం కల్పించారు. దీంతో బిహార్‌, గోవా, మణిపూర్‌ తదితర రాష్ట్రాల్లోనూ అతిపెద్ద పార్టీలుగా నిలిచిన పలు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్‌లను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘాలయాలో అధికార బీజేపీకూటమిని గద్దె దింపి.. ప్రతిపక్షాల ఐక్యతతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలని హస్తం పార్టీ యోచనలో ఉందని సమాచారం.