చరిత్ర సృష్టించిన తబస్సుమ్‌ హసన్‌..

SMTV Desk 2018-05-31 17:48:54  Tabassum Hasan, Kairana, RLD vs bjp, by poll elections

లక్నో, మే 31 : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌ ఉప ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత ప్రతిష్టాత్మకమైన కైరానా నియోజకవర్గంలోనూ బీజేపీకు ఓటమి తప్పలేదు. కైరానా లోక్ సభ స్థానంను ఆర్‌ఎల్‌డీ(రాష్ట్రీయ లోక్‌దళ్‌) అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌.. బీజేపీ అభ్యర్థి మృగాంకా సింగ్‌పై 55 వేల ఓట్ల మెజార్టీతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో లోక్‌సభలో యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి ముస్లింగా తబస్సుమ్‌ నిలిచారు. ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక యూపీ ముస్లిం లోక్‌సభ సభ్యురాలిగా తబస్సుమ్‌ నిలవగా, రాజ్యసభలో ఇద్దరు ముస్లింలు జావేద్‌ అలీ ఖాన్‌, తన్జీమ్ ఫాట్మాలు ఎస్సీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009లో హసన్‌ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. కానీ, ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత బీఎస్పీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో కైరానా స్థానం నుంచి భాజపా అభ్యర్థి హుకుమ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆమె కొడుకు నహిద్‌ను నిలబెట్టారు. కానీ ఈ ఎన్నికల్లో హుకుమ్‌ సింగ్‌ గెలుపొందారు. హుకుమ్‌ సింగ్‌ మరణంతో కైరానా నియోజకవర్గం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో విపక్షాలు(సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, కాంగ్రెస్‌) అన్నీ కలసి ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చాయి.