కైరనాలో కంగుతిన్న కమలం..

SMTV Desk 2018-05-31 16:13:06  Kairana loksahba bypoll, Tabassum Hasan, bjp vs rld, rld

లఖ్‌నవూ, మే 31 : కైరానా(ఉత్తరప్రదేశ్‌) లోక్‌సభ స్థానంను విపక్ష పార్టీలు సొంతం చేసుకున్నాయి. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ తన సమీప ప్రత్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో విపక్షాలు(సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, కాంగ్రెస్‌) అన్నీ కలసి ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చాయి. దీంతో లోక్‌సభలో బీజేపీ మరో సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ ఎంపీ హుకుమ్‌ సింగ్‌ మరణంతో కైరానా నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. దీంతో ఈ నెల 28న ఉప ఎన్నిక నిర్వహించారు. బీజేపీ తరఫున హుకుమ్‌ సింగ్‌ కుమార్తె మృగాంక సింగ్‌ పోటీ చేయగా.. ఆర్‌ఎల్‌డీ తరఫున తబస్సుమ్‌ బరిలోకి దిగారు. పాల్‌ఘర్‌ స్థానం కమలం కైవసం.. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాషాయిదళం విజయభేరీ మోగించింది. బీజేపీ ఎంపీ చింతమన్‌ వనాగా మరణంతో ఈ నియోజకవర్గం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహించారు. బీజేపీ తరఫున రాజేంద్ర గవిత్‌ పోటీ చేయగా.. శివసేన పార్టీ నుంచి శ్రీనివాస్‌ వనాగ బరిలోకి దిగారు. తొలి నుంచి ఆధిక్యం ప్రదర్శించిన రాజేంద్ర ఈ ఎన్నికల్లో 29వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు మహారాష్ట్రలోని మరో లోక్‌సభ నియోజవర్గం భండారా-గోండియాలో ఎన్సీపీ... నాగాలాండ్‌ లోక్‌సభ స్థానంలో ఎన్డీపీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.