కర్ణాటక కేబినేట్ ఓ కొలిక్కి..!

SMTV Desk 2018-05-31 15:16:48  karnataka cabinet, congress-jds, karnataka cabinet, congress

బెంగళూరు, మే 31: ఎన్నో ఉత్కంఠ పరిణామాల మధ్య కర్ణాటక సీఎంగా కుమారస్వామి కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం నేతృత్వంలో ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా అతను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వారం గడిచినా కుమారస్వామి ఇంకా తన కేబినెట్‌ను ఏర్పాటుచేయలేదు. కాగా.. మంత్రి పదవుల పంపకాలపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి చేరినట్లు సమాచారం. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు హోంశాఖ, జేడీఎస్‌కు ఆర్థికశాఖ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మంత్రివర్గంలో శాఖలు ఈ చర్చలు తుది దశకు చేరినట్లు జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. మే 15న వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో కుమారస్వామి సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఏ పార్టీకి ఏయే మంత్రి పదవులు రావాలన్నదానిపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా జేడీఎస్‌ నేతలతో చర్చించారు.