రైతు రుణామాఫీ దిశగా కుమారస్వామి సర్కారు..

SMTV Desk 2018-05-29 19:14:55  kumara swami, hd kumara swami, karnataka elections, congress-jds

బెంగళూరు, మే 29: కర్ణాటకలో రైతు రుణామాఫీ దిశగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రైతు అసోసియేషన్, ఆర్గనైజేషన్లతో బుధవారంనాడు చర్చలు జరపనున్నారు. శాసన సభలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుపుతారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రుణ మాఫీ వంటి సమస్యలను రైతు సంఘాలతో ముఖ్యమంత్రి చర్చించి తదుపరి కార్యాచరణ చేపడతారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. రైతు రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నట్టు కుమారస్వామి సోమవారం మీడియా సమావేశంలోనూ స్పష్టం చేశారు. జేడీఎస్‌ను ప్రజలు ఎన్నుకుంటే 24 గంటల్లోపు రైతు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేశానని, అయితే ఇప్పుడు సంకీర్ణ ధర్మ ప్రకారం తమకు కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. ఇచ్చిన మాటను మాత్రం తప్పేది లేదని, అయితే తనకు కొద్దిపాటి సమయం ఇవ్వాలని ఆయన కోరారు. రైతు రుణాల మాఫీ చేయకుంటే సీఎం పదవికి తాను రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ఆయన ప్రకటించారు.