నైరుతి రుతుపవనాలు వచ్చేశాయెచ్చు..

SMTV Desk 2018-05-29 14:11:00  south west mon soon, kerala south west monsoon, imd, skymate

ఢిల్లీ, మే 29 : రైతులకు చల్లటి కబురు మూడు రోజులు ముందే వచ్చేసింది. అనుకున్నదానికంటే మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం ఈ రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు పేర్కొంది. తొలుత జూన్‌ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. అయితే అంతకంటే 3 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. రుతుపవనాల రాకతో కేరళలో నేడు, లేదా రేపు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. రుతుపవనాలు సోమవారమే కేరళను తాకినట్లు స్కైమెట్‌ తెలపడం గమనార్హం. గతేడాది మే 30 కల్లా నైరుతీ రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించినా తర్వాత అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావంతో పురోగతికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి 12 రోజులు పట్టింది. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాకుంటే సకాలంలోనే నైరుతీ రుతు పవనాలు తెలంగాణకు వ్యాపించే అవకాశం ఉంది.