యూనివర్సల్ బాస్.. గబ్బర్.. హిట్ మ్యాన్.. డ్యాన్స్ చూశారా!

SMTV Desk 2018-05-29 12:50:03  chris gayle dance, dhawan dance, ipl-11, rohith sharma

ముంబై, మే 29 : ఐపీఎల్‌-11 సీజన్ ఎంతో అద్భుతంగా ముగిసింది. ఫైనల్లో సన్ రైజర్స్ జట్టుపై నెగ్గి మూడో సారి ట్రోఫీని ఎగేరేసుకుపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ జట్టు ఆటగాళ్లు పట్టరాని సంతోషంతో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇంకా చెన్నై జట్టులో వెస్టిండీస్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో సంగతి వేరే చెప్పక్కరలేదు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో గేల్‌.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గేల్‌ కూడా తన చుట్టూ ఉన్న వాతావరణం సరదాగా మార్చేస్తాడు. తాజాగా శిఖర్‌ ధావన్‌, క్రిస్‌ గేల్‌, రోహిత్‌ శర్మ ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆటగాళ్లు కలిసి వేదికపై సందడి చేశారు. క్రిస్‌ గేల్‌ చూపించిన స్టెప్పులను ధావన్‌, రోహిత్‌ వేయడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతకుముందు వేదికపై డ్యాన్సర్లతో కలిసి గేల్‌ కాలు కదిపిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టోర్నీ ఆరంభంలో విజయాలతో అదరగొట్టిన పంజాబ్‌ ఆ తరువాత అంతగా రాణించలేదు. దీంతో ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. హిట్ మ్యాన్ సారథ్యంలో గత ఏడాది విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ఈ టోర్నీ ఆరంభం నుంచి అంతగా రాణించలేకపోయింది. దీంతో ఆ జట్టుకు కూడా ప్లేఆఫ్‌లో చోటు దక్కలేదు. ధావన్ ప్రాతినిధ్యం వహించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.