కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

SMTV Desk 2018-05-29 11:50:39  karimnagar road accident, manakondur accident, karimnagar road accident, hyderabad

కరీంనగర్‌, మే 29 : కరీంనగర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద మంగళవారం ఉదయం 40 మంది ప్రయాణికులతో కరీంనగర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును... ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా... మరో 15 మంది క్షతగాత్రులయ్యారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు, పోలీసులు బయటకు తీశారు. గాయపడ్డవారిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సును ఢీకొన్న లారీ అంతటితో ఆగకుండా బస్సు వెనుకే వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను సైతం ఢీకొంది. దీంతో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే మంత్రి ఈటల రాజేందర్‌ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామన్నారు. చెంజర్ల ప్రమాదం గురించి తెలియగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరిగిన ప్రాణనష్టంపై ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.