జోన్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర..

SMTV Desk 2018-05-27 18:57:05  ts cm, kcr, cabinet meeting, jones cadre, state cabinet green signal

హైదరాబాద్, మే 27 : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎల్.ఐ.సి. ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ రెండు అంశాలను ఆమోదించింది. టి.ఎన్.జి.ఓ.ల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీ వి. శ్రీనివాస గౌడ్, టి.ఎన్.జి.ఓ.ల సంఘం అధ్యక్షుడు శ్రీ కారం రవీందర్ రెడ్డిలను ఈ కేబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. ** కేబినెట్ ఆమోదించిన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి >> తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు ఏర్పాటవుతాయి. తెలంగాణలో ఇకపై ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉంటాయి. స్టేట్ కేడర్ పోస్టులను ఖచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు. >> ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యాభ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా గుర్తిస్తారు. >> అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరిగా ఉంటుంది. >> రాష్ట్రంలోని 18-60 ఏళ్ళ వయస్సున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవితబీమా వర్తిస్తుంది. ఎల్.ఐ.సి. ద్వారా జీవిత బీమా అమలు చేస్తారు. ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది. బీమా ప్రీమియానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం బడ్జెట్‌లోనే కేటాయిస్తుంది. జూన్ 2 నుండి రైతుల వద్ద నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు. >> వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతారు. >> రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతో పాటు ఇతర సిబ్బందిని నియమిస్తారు.