రషీద్ ను భారత్ కు ఇవ్వం : అష్రఫ్ ఘనీ

SMTV Desk 2018-05-26 18:00:41  rashid khan, Afghanistan President Ashraf Ghani, srh, ipl-11

న్యూఢిల్లీ, మే 26: ఐపీఎల్-11 టోర్నీ లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ ఆల్‌రౌండర్‌ ప్రతిభ కనబరుస్తూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. శుక్రవారం క్వాలిఫైయర్-1 లో కొల్‌కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ 10 బంతుల్లో 34 పరుగులు చేయడమే కాక.. 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అటు బ్యాట్ తోను, ఇటు బాల్ తోనూ రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో రషీద్‌పై సర్వత్రా ప్రశంసలజల్లు కురిసింది. క్రికెట్ అభిమానులయితే రషీద్‌ను ఆకాశానికెత్తేశారు. అంతేకాదు.. పలువురు అభిమానులు రషీద్‌ను టీమిండియాకు ఇచ్చేయాలంటూ కోరారు. "ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఓ ఒప్పందం చేసుకోవాలి. ఆ ఒప్పందం ప్ర‌కారం రవీంద్ర జ‌డేజాను ఆఫ్ఘనిస్తాన్‌కు ఇచ్చేసి.. ర‌షీద్‌ను ఇండియా త‌ర‌ఫున ఆడించాలి" అంటూ ట్వీట్లు చేశారు. ఇంకొంద‌రు నెటిజ‌న్లు ఏకంగా ర‌షీద్‌కు భార‌త పౌర‌స‌త్వం ఇవ్వాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌కు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు విప‌రీతంగా రావ‌డంతో సుష్మా కూడా స్పందించాల్సి వ‌చ్చింది. "మీరంద‌రూ చేస్తున్న ట్వీట్లు చూస్తున్నాను. ఆ విష‌యాన్ని కేంద్ర హోం శాఖ చూసుకుంటుంది" అని ఆవిడ బదులిచ్చారు. రషీద్‌పై వస్తున్న ప్రశంసలు, అతన్ని భారత్‌కు ఇచ్చేయాలంటూ వస్తున్న ట్వీట్లపై ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్పందించారు. "మా హీరో పట్ల ఆఫ్ఘనిస్తాన్ గర్వంగా ఫీలవుతోంది. మా ఆటగాళ్ల ప్రతిభను ప్రదర్శించడానికి వేదక కల్పిస్తున్న భారతీయ మిత్రులకు కృతజ్ఞతలు. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటో రషీద్ మళ్లీ గుర్తుచేశాడు. క్రికెట్ ప్రపంచానికి రషీద్ ఆసక్తికరమైన వ్యక్తిగా మారాడాని, అతన్ని వదులుకోబోము" అంటూ ప్రధాని మోదీకి సరదాగా ట్వీట్ చేశారు.