అంధకారంలో అద్భుతం

SMTV Desk 2017-07-10 16:14:10  The, miracle, is, awesome

కాజీపేట, జూలై 10 : కాస్త చీకటిగా ఉంటేనే మనకు ఏ వస్తువు ఎక్కడుందో తెలీదు. అలాంటిది కళ్ళకు గంతలు కడితే ఇక చిమ్మ చీకటే. కానీ ఒక బాలుడు కళ్ళకు గంతలు కట్టినా.. న్యూస్ పేపర్ చదవడం, లెక్కలు చేయడం, కేవలం వాసనతో కరెన్సీనోటు విలువ, దానిపై ఉన్న నంబరు కూడా చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. వివరాలలోకి వెళితే వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట సిద్ధార్థనగర్‌కు చెందిన పాకనాటి శ్రీనివాస్ రెడ్డి, పద్మ దంపతుల కుమారుడు రిత్విక్‌రెడ్డి హన్మకొండలోని ప్రైవేటు పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్నాడు. అంతకుముందు ఈ కుటుంబం ఖమ్మం జిల్లా కోదాడలో ఉండేది. అక్కడ వరప్రసాద్‌ అనే వ్యక్తి దగ్గర రిత్విక్‌ మ్యాజిక్‌, స్మెల్‌ థెరఫీ నేర్చుకున్నాడు. వస్తువులను చూడకుండా కేవలం వాసన చూసి, వాటి శబ్దాలను విని.. అవేమిటో చెప్పే విద్యను నేర్చుకున్నాడు. చుట్టుపక్కల వారికి ఇదో వింతగా అనిపించడంతో తరచూ రిత్విక్‌ ఇంటికి వచ్చి ఆ బాలుడి ప్రతిభను వీక్షిస్తున్నారు. ప్రతినిధులు రిత్విక్‌ ఇంటికి వెళ్లి అతడి గ్రాహకశక్తిని పరీక్షించారు. అసలు రిత్విక్‌కు సంబంధంలేని ఆధార్ కార్డ్ ఇవ్వగా వాసన చూసి అందులో ఉన్న వ్యక్తి పేరూ నంబర్, కరెన్సీ నోట్లు ఇవ్వగా వాటి విలువ, సీరియల్‌ నంబరు చెప్పాడు. పేక ముక్కలను వాటి గుర్తులు, నంబర్లను, క్యాలెండర్‌ తీసుకుని వాటి పేజీలు మార్చి ఇచ్చినా అది ఏ నెల పేజీయో చెప్పాడు. పత్రికలోని వార్తలను చదివి పేజీలు తిప్పుతూ ఫొటోల వివరాలన్ని తెలుపుతూ ఔరా అనిపిస్తున్నాడు. దీనికి చాలా ఏకాగ్రత అవసరం. మా గురువు వరప్రసాద్‌ ముందుగా ఏకాగ్రతను నేర్పించి వస్తువులు, అక్షరాలు, నంబర్ల శబ్దాలు, వాటి వాసనల మీద శిక్షణ ఇచ్చారు. ఏ మాత్రం అంతరాయం కలిగినా ఏకాగ్రత పోయి చెప్పలేం. అందుకని కాస్త ఏకాగ్రతతో నేర్చుకున్నా. - రిత్విక్‌ రెడ్డి తెలివితేటలున్న ఉన్న పిల్లలను గుర్తించి, వారి మెదడుకు మరింత పదును పెడతాం. మెదడును పూర్తి స్థాయిలో వినియోగిస్తే మానవుడు ఎంత కష్టసాధ్యమైన పనులైనా చేయవచ్చు. రిత్విక్‌ చాలా వేగంగా శిక్షణ పూర్తి చేశాడు. మున్ముందు అద్భుతాలు చేయగలడని నా నమ్మకం. - శిక్షకుడు, వరప్రసాద్