టొరంటో బాంబు పేలుడుపై స్పందించిన సుష్మా..

SMTV Desk 2018-05-25 15:37:45  Minister of External Affairs of India, sushma swaraj, toronto bomb blast, sushma

టొరంటో, మే 25 : ప్రవాస భారతీయులకు చెందిన రెస్టారెంట్‌లో గురువారం రాత్రి 10:30 గంటలకు జరిగిన పేలుడు ఘటన కలకలం రేపింది. కెనడాలోని ఒంటారియో మిస్సిస్వాగాలోని భారతీయ రెస్టారెంట్‌ "బాంబే భెల్‌"లో జరిగిన ఈ ఘటనలో మొత్తం 18 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారతీయ రెస్టారెంట్‌లో పేలుడు జరిగిన ఘటనపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారు. "కెనడాలో భారత హైకమిషనర్‌తో, టొరంటో కాన్సుల్‌ జనరల్‌తో ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకున్నాను. తగిన సహాయం అందేలా చూస్తాను. అత్యవసర సమాచారం కోసం 1-647-668-4108 సంప్రదించండి" అంటూ సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఈ చర్య ఉగ్రవాదుల ఘటన అనేది ఖచ్చితంగా చెప్పలేమని.. రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చిన పేలుడు పదార్థాలను పేల్చేసినట్లు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైనట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. సీసీటీవీలో రికార్డయిన వారి ఫొటోలను పోలీసులు ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. పేలుడు సంభవించిన ప్రాంతం వద్ద భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రదేశాన్నంతా ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో పలువురు భారతీయులు హోటల్లో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.